Thursday 26 September 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:   ఎదురేముంది నాకంటూ, పదపదవే నువ్వు ఓ మనసా!
           విలువేముంది నీకంటూ, మరి ముడుచుకునుంటే ప్రతివేళ   ll 2 ll
చరణం:   వాడని నవ్వుల వేడుకలే జీవితమంటే
            వీడని మమతల వెల్లువలే నందనమంటే
            ఆ మమతల వెన్నెలలో ఈ నవ్వుల పున్నమిలో
            నిండు చందమామవై నిలవవె నువ్వు నా మనసా!
            విరామమెందుకు నాకంటూ వినోదమే నా పథమంటూ
            అందరి వైపుల కడుగెయ్యి ఆపదలను తుడిచెయ్యి
            ఆగక జారే ఆనందాశృవులే అక్షితలు నీకని చాటవె నా మనసా!
                                                             ll ఎదురేముంది ll
చరణం:    పంతం పట్టు! నవ్వుల సీమంతం ఈ లోకానికి చేయిస్తానంటూ
             ఒట్టే పెట్టు! కరువై పోయిన మానవతను కన్నుల విందుగ                                                     పండిస్తానంటూ
             విలువలు కలువలుగా విరబూస్తే నలుగురితో నేనంటూ                   అందరొక్కటిగ నినదిస్తే
             అందని స్వర్గం ఏముందంటూ, రేపటి భవిత మనదేనంటూ
             నినదిస్తూ నువ్ ముందుకు సాగవే నా మనసా!
                                                               ll ఎదురేముంది ll

************

Thursday 12 September 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి :        పరిచయాల పొదరింట్లో గళమెత్తిన కోయిలలై 
పాడుచున్నవో చెలీ మన మనసులే 
అనుభవాల తీరంలో అలుపెరుగని పయనంలో 
ఒక్కటై! సాగుతున్నవో చెలీ మన ఊహలే   
చరణం:     మేఘమల్లె సాగిపోతూ గగనానికి గిలిగింతలిడుతూ 
మెరిసి మాయమయ్యే వేళ హరివిల్లులు పూయించేద్దాం 
లోకాన్నే నవ్వించేద్దాం 
గాలికూయలూగేటి పూబాలతో శృతి కలిపి 
పరవశమను రాగానా అందరినీ మురిపించేద్దాం 
మధురిమలను పంచేద్దాం
                                                      ll పరిచయాల ll

చరణం:      కిలకిలమను గువ్వలకు మన ఎదసడులను నేర్పేద్దాం 
కొండలలో కోనలలో కులాసాగ పాడిద్దాం 
తొలివెలుగుల తేరులపై సాగుతు, మనమిద్దరమూ 
కమ్మని వలపుల తలపులతో 
అణువణువును మేల్కొల్పేద్దాం 
మరో ప్రభాత గీతికతో ఈ ప్రకృతికి హారతి పట్టేద్దాం 
                                                     ll పరిచయాల ll
********

Wednesday 4 September 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:      కన్నీటితో మొలకెత్తే   విత్తు కాదు గెలుపంటే
                         ఆ నీటనె ఆరిపోయే దివ్వె కాదు బ్రతుకంటే     2 సా. 

చరణం:     తీరాన నవ్వులు రువ్వే ఆ అలనడుగు ఎపుడైనా 
           దూరాలను చెరిపేసే కళనెక్కడ నేర్చావంటూ?
                విరబూసి నవ్వుతున్న ఆ మానునడుగొకమారైనా
             ఆశలన్ని రాలినాక ఇన్ని నవ్వులెక్కడివంటూ?
 పరుగెత్తే తెగువే ఉంటే చాలును నీలో 
     విరబూసే తలపే ఉంటె చాలును ఎదలో 
            మూగదైవోవును గాదా అపజయము అన్నది 
                       వాహిని అయి ఉరుకును గాదా ఆ జయము అన్నది. 
                                                                                        "కన్నీటితో "
             
          చరణం :  సంకల్పం నీలో ఉంటే  శ్రమ తత్త్వం నీదే ఐతే 
                             సాహసమే ఊపిరి అంటూ     సహనంతో సాగిపోతే 
                                నిరాశలు, నిట్టూరుపులు మేఘమల్లె కరుగును గాదా!
                              వరాలెన్నో వానజల్లై కురిసి బ్రతుకు పండును గాదా?
                                                                                                                                                                               "కన్నీటితో"
 చరణం  :   నవ్వు నువ్వు ఏకమయ్యి నందనమై సాగిపోరా 
                మనసు నీకు తోడైయుంటే శోకమైన శ్లోకమే గదరా 
               అంతులేని చరితని రాస్తూ మునుముందుకు సాగిపోరా 
               అవధి లేని ఆనందాన్ని అందరితో పంచుకుంటూ 
               కలకాలం నవ్వుతు నువ్వు బ్రతకాలిరా ఓ నేస్తమా. 
                                                                                     "కన్నీటితో"
              *********