Monday 2 December 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:       కాదు పొమ్మంటే ఆ ఆకాశం, చేరదీసిందీ నాకోసం పుడమి                 బృత్యాలుగ, పాడేటి ఈ ముత్యాలను                జీవన సరాలల్లె సత్యాలుగా చరణం:     మోసి మోసి చిగురాకు బొట్టుబొట్టుగ జారవిడిచేవేళ
               బెట్టు చెదిరీ ఆ మన్ను బ్రతుకు నాడికి వెన్నుదన్నైన వేళ
               పొంగి పారేటి వాగు వంకల హంగు చూపీ నేల                నలుమూలల నెయ్యమొందు వేళ ఆ నింగితో                మా ఎదలు పాడు చిటపటల పాట
చరణం:     కొత్త జంట చెప్పుకునే కడలేని ఊసులే                చిన్ని పాప విసిరేటి లెక్కలేని నవ్వులోయ్                తొలిప్రేమ ఎదలోని తుదిలేని సవ్వడోలె
               నీటి దీపాలు వెలిగించే వానజాణ ఈ అవనిలోన.
                             **********

Tuesday 29 October 2013

శిద్దాని భావగీతాలు


పల్లవి:   తొలి మంచు చీరగట్టి, సొగసులకు తళుకద్దుకుంటూ 
            రాతిరేల కన్న కలలు పిట్టనోట పాటజేసి 
            సద్దుమణిగిన లోకానికి సవ్వడులు నేర్పేటి 
            రాతి మేనుదాన! నవనీతపు హృదయంపుదాన!
చరణం:  అల్లంత దూరాన ఆణిముత్యమై మెరిసేవు 
             ఆస్వాదించే మనసుల ఆనందపు విందు చేసేవు 
             దాపు చేర, దృశ్యకావ్యమై వెలిసేవు 
             రసావేశముప్పెంగే విరితోటగ మదిని మలచేవు 
             నీలినీలి గగనాన సాగేటి మబ్బులన్ని, చెలులే నాకంటూ 
             వాటితోటే మనసు విప్పి చెప్పుకున్న ఊసులే కురిసేటి ఈ వానజల్లులంటూ 
             చిగురాకు చెవిలోన చిత్రంగా చెబుతూ 
             అందాల వాకిట ఆకుపచ్చని పందిళ్ళు వేసేవు 
             నీ ఇంట పేరంటమంటూ మా చూపులను పిలిచేవు     ll తొలి ll
చరణం:  నీ సోయగాల సహవాసాన నా మనసు తొక్కే పరవళ్ళను 
             నీపై సెలయేళ్ళుగ వెలయించుకుని 
             నిన్ను పిలిచే నా పిలుపులను 
            నీ వలపు మాగాణిని పండించే విత్తులుగా నాటుకుని 
            మౌనంగా జారే నా మోదబాష్పాలకు 
           దూకే నీ జలపాతాల హోరు నచ్చి 
           వివిధానుభూతుల వికసిత వేణియపై 
           కిలకిల కలస్వరాలను నాకై మ్రోగిస్తూ 
          ఈయవే నా మనసుకు నీయంత అండ     ll తొలి ll
                              ******** 

 

Wednesday 23 October 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:      దున్నపోతులం మేము మదపు తేటులం
               సిగ్గన్నది యొగ్గేసి బుద్ధన్నది రాదంటూ
              సంస్కృతి సిగదరుగు మగదీరులం

చరణం:    వెంటాడేస్తాం వేటాడేస్తాం
              కౄర మృగమంటి మా కౌగిళ్ళలో అతివల నల్లాడించేస్తాం
              వీధుల కెక్కిన వనితల దేహాలపై
              మా వికృత ఊహాస్వాలానుడ్ ఒక్క పెట్టున ఉరికించేస్తాం
              ఉప్పెనగా, విలయం ఆమె కన్నుల కారుతూ ఉంటె
              హాయిగా నిట్టుర్చేస్తాం, మానాలను అవమానించేస్తాం
              పరువామెదే అన్న లోకపు తీరు
              పరవాలేదంటూ మా గర్వాలకు ఊపిర్లూదుతుంటే
              ఏ దేవుడు దిక్కులే ఈ దేశాన అబలలకంటూ
              ఆకాశం అదిరేలా అరిచేస్తాం                            ll దున్నపోతులంll

చరణం:   నిర్భయలు, అభయలంటూ మా సాహసాలు బరితెగిస్తుంటే
             ఉలికి పడడమో! ఉసూరుమనడమో! మించి
             మమ్మల్ని ఏమి చేయగలరు మీరంటూ సవాలు విసిరేస్తాం
             అందరిలో చిగురించిన చైతన్యం చిరంజీవి కాని చోట
             ఎపుడో గాని గుణపాతం చెప్పవుగా వేలాడే ఉరితాళ్ళు            
             చట్టాలు సెక్షనులు ఎన్నుంటే మాకే
           అబలన్న పేరు పోలేదుగా ఆడదాని భావమే మాకు శ్రీరామరక్ష      ll దున్నపోతులంll
                                 **********

Saturday 19 October 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:  ఏమైందే నీకు ఓ మనసా, మారిందిలా నీ వరసా
           కన్నుల ముందుకొస్తే కలలు గన్న అప్సరస
           మిన్నులకెగసింది నీ శ్వాస
చరణం:   పున్నమి నాటి వెన్నెల పొంగును, కొంగున గట్టి
            ఆశలు రేపే మల్లెలు కొప్పున చుట్టి
            నడుమొంపున నా చూపుల తీగలు నాజుకుగ కట్టి
            మ్రోగే వీణియ తానంటూ
            విరిసిన హరివిల్లులు తన చెలులంటూ
            కదిలే వెన్నెల గోదారిలా, కవ్వించే వలపుల దేవేరిలా
            అందంగా ఆమె ఇటు వస్తుంటే                   ll ఏమైపోయిందే ll
చరణం:    కోహినూరు కాంతులన్ని ఒక్కచోట కొలువుదీరి
             తనను కొలిచే దారి చూపమంటూ
             నా గుండె తలుపులే తడుతూ ఉంటే
             పలుకులెన్నో నేర్చుకొచ్చి, కొత్త పాటలాగా వాని కూర్చి
             తనను గూర్చి కోకిలమ్మ చేస్తుంటే! కచ్చేరి
             నడిచే కోవెలై నవ్వే జాబిలై
             ఆ తెలుగింటి అలివేణి, నా వలపంటి విరిబోణి
             ఓర చూపుల నారి సారిస్తే నీ వైపు   ll ఏమైపోయిందే ll

                                  **********    


Friday 18 October 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:             పరుగెత్తే ఏరు రాదు పరువంలో నాకు పోటి
                     విరబూసిన తీగ కాదు సోయగాన నాకు సాటి
చరణం:            చిటపటమను ఆ చినుకులు పాడెను నా పాటల శృతులు
                     కిలకిలమను ఆ రవములె, ఆడే నా, అందెల సవ్వడులు
                     సెలయేటి నురుగులె, నా నవ్వుల నగవులు
                     పొంగేటి మధువులవె పిలిచేటి నా పాటలు       ll పరుగెత్తే ll
చరణం:   ఎగసే తెమ్మెరలో పూసిన ఇంద్రధనుస్సే, నా మనసు
              పూదోపునూయలూపు గాలి పాడు గాంధర్వమే, నా మేని సుగంధం
              రేకులు విచ్చిన నా పడుచు సోయగమే, ఆరారు
              ఋతువులనూరించు నయగారం                           
              చెక్కిలిపై జారేటి నాదు ఆనందబాష్పమే కడలి మోజు పడేటి                              ఆణిముత్యం                                  ll పరుగెత్తే ll                                                
చరణం:             మది తలపులు మాయూరాలై ఆడగా
                      ఆ తలపుల తొలకరి తెరచాటుగా కలగన్న వాడు రాగా
                      కలిసిన మా ఎదలయలతో
                      ప్రణయానికి ప్రాణం పోస్తాం
                      పారవస్యపు పరసువేదాన్ని ఈ లోకానికి నేర్పించేస్తాం.
                                                                                ll పరుగెత్తే ll
                                                  **********  
 

Saturday 5 October 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:    జానెడంత చోటులో ఎగరని, జయకేతనం! సాక్షిగా
           ఎర్రబడిన కళ్ళలో పొంగుతున్న సాగరం! సాక్షిగా
           ఎక్కడ వెలిగిపోతోంది, నా భారతం
   వేదనతో కుములుతుంటే నా తరం      ll ఎక్కడ 2 సా ll
చరణం:   అంధుడైన ప్రభువు ఒక్కడు కాడిప్పుడు
           నూరుగురైన వాడి వారసులు నూరు లక్షలిపుడు
           నిండు సభలో నాటి ఆడదాని దైన్యం
           నడి రోడ్డుకు నేడు చేరిన వైనం
           ముందుకే పోతున్నామా మనమంటూ
           అడుగుతున్న పసి మానం
           ఎందుకు కాలేక పోతోందో! ఆసేతుహిమాచలాన్ని
           అదిలించే అంకుశం       ll జానెడంత ll
చరణం:   కోటి ఊటల మాటలిక్కడ
            కోటి కాసుల మూటలక్కడ
            ఉన్నదంత ఊడ్చేసే నేర్పు
            ఆ నేతకు నేర్పింది నీ ఓర్పు
            అని అంటుంటే డెమోక్రసీ
            ఎప్పుడొస్తుంది భాయీ నీలో కసి
            ఏ లోటు లేదు నాకు ఏ చేటు రాదు నాకు
            అంతమైపోయింది నా వెతల కురుక్షేత్రమంటూ
            యుగాంతానికైనా నినదించగలవా నువ్వు ఓ భారతీయుడా.                         ll జానెడంత ll
                                    ************


Thursday 26 September 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:   ఎదురేముంది నాకంటూ, పదపదవే నువ్వు ఓ మనసా!
           విలువేముంది నీకంటూ, మరి ముడుచుకునుంటే ప్రతివేళ   ll 2 ll
చరణం:   వాడని నవ్వుల వేడుకలే జీవితమంటే
            వీడని మమతల వెల్లువలే నందనమంటే
            ఆ మమతల వెన్నెలలో ఈ నవ్వుల పున్నమిలో
            నిండు చందమామవై నిలవవె నువ్వు నా మనసా!
            విరామమెందుకు నాకంటూ వినోదమే నా పథమంటూ
            అందరి వైపుల కడుగెయ్యి ఆపదలను తుడిచెయ్యి
            ఆగక జారే ఆనందాశృవులే అక్షితలు నీకని చాటవె నా మనసా!
                                                             ll ఎదురేముంది ll
చరణం:    పంతం పట్టు! నవ్వుల సీమంతం ఈ లోకానికి చేయిస్తానంటూ
             ఒట్టే పెట్టు! కరువై పోయిన మానవతను కన్నుల విందుగ                                                     పండిస్తానంటూ
             విలువలు కలువలుగా విరబూస్తే నలుగురితో నేనంటూ                   అందరొక్కటిగ నినదిస్తే
             అందని స్వర్గం ఏముందంటూ, రేపటి భవిత మనదేనంటూ
             నినదిస్తూ నువ్ ముందుకు సాగవే నా మనసా!
                                                               ll ఎదురేముంది ll

************

Thursday 12 September 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి :        పరిచయాల పొదరింట్లో గళమెత్తిన కోయిలలై 
పాడుచున్నవో చెలీ మన మనసులే 
అనుభవాల తీరంలో అలుపెరుగని పయనంలో 
ఒక్కటై! సాగుతున్నవో చెలీ మన ఊహలే   
చరణం:     మేఘమల్లె సాగిపోతూ గగనానికి గిలిగింతలిడుతూ 
మెరిసి మాయమయ్యే వేళ హరివిల్లులు పూయించేద్దాం 
లోకాన్నే నవ్వించేద్దాం 
గాలికూయలూగేటి పూబాలతో శృతి కలిపి 
పరవశమను రాగానా అందరినీ మురిపించేద్దాం 
మధురిమలను పంచేద్దాం
                                                      ll పరిచయాల ll

చరణం:      కిలకిలమను గువ్వలకు మన ఎదసడులను నేర్పేద్దాం 
కొండలలో కోనలలో కులాసాగ పాడిద్దాం 
తొలివెలుగుల తేరులపై సాగుతు, మనమిద్దరమూ 
కమ్మని వలపుల తలపులతో 
అణువణువును మేల్కొల్పేద్దాం 
మరో ప్రభాత గీతికతో ఈ ప్రకృతికి హారతి పట్టేద్దాం 
                                                     ll పరిచయాల ll
********

Wednesday 4 September 2013

శిద్దాని భావగీతాలు

పల్లవి:      కన్నీటితో మొలకెత్తే   విత్తు కాదు గెలుపంటే
                         ఆ నీటనె ఆరిపోయే దివ్వె కాదు బ్రతుకంటే     2 సా. 

చరణం:     తీరాన నవ్వులు రువ్వే ఆ అలనడుగు ఎపుడైనా 
           దూరాలను చెరిపేసే కళనెక్కడ నేర్చావంటూ?
                విరబూసి నవ్వుతున్న ఆ మానునడుగొకమారైనా
             ఆశలన్ని రాలినాక ఇన్ని నవ్వులెక్కడివంటూ?
 పరుగెత్తే తెగువే ఉంటే చాలును నీలో 
     విరబూసే తలపే ఉంటె చాలును ఎదలో 
            మూగదైవోవును గాదా అపజయము అన్నది 
                       వాహిని అయి ఉరుకును గాదా ఆ జయము అన్నది. 
                                                                                        "కన్నీటితో "
             
          చరణం :  సంకల్పం నీలో ఉంటే  శ్రమ తత్త్వం నీదే ఐతే 
                             సాహసమే ఊపిరి అంటూ     సహనంతో సాగిపోతే 
                                నిరాశలు, నిట్టూరుపులు మేఘమల్లె కరుగును గాదా!
                              వరాలెన్నో వానజల్లై కురిసి బ్రతుకు పండును గాదా?
                                                                                                                                                                               "కన్నీటితో"
 చరణం  :   నవ్వు నువ్వు ఏకమయ్యి నందనమై సాగిపోరా 
                మనసు నీకు తోడైయుంటే శోకమైన శ్లోకమే గదరా 
               అంతులేని చరితని రాస్తూ మునుముందుకు సాగిపోరా 
               అవధి లేని ఆనందాన్ని అందరితో పంచుకుంటూ 
               కలకాలం నవ్వుతు నువ్వు బ్రతకాలిరా ఓ నేస్తమా. 
                                                                                     "కన్నీటితో"
              *********