Tuesday 29 October 2013

శిద్దాని భావగీతాలు


పల్లవి:   తొలి మంచు చీరగట్టి, సొగసులకు తళుకద్దుకుంటూ 
            రాతిరేల కన్న కలలు పిట్టనోట పాటజేసి 
            సద్దుమణిగిన లోకానికి సవ్వడులు నేర్పేటి 
            రాతి మేనుదాన! నవనీతపు హృదయంపుదాన!
చరణం:  అల్లంత దూరాన ఆణిముత్యమై మెరిసేవు 
             ఆస్వాదించే మనసుల ఆనందపు విందు చేసేవు 
             దాపు చేర, దృశ్యకావ్యమై వెలిసేవు 
             రసావేశముప్పెంగే విరితోటగ మదిని మలచేవు 
             నీలినీలి గగనాన సాగేటి మబ్బులన్ని, చెలులే నాకంటూ 
             వాటితోటే మనసు విప్పి చెప్పుకున్న ఊసులే కురిసేటి ఈ వానజల్లులంటూ 
             చిగురాకు చెవిలోన చిత్రంగా చెబుతూ 
             అందాల వాకిట ఆకుపచ్చని పందిళ్ళు వేసేవు 
             నీ ఇంట పేరంటమంటూ మా చూపులను పిలిచేవు     ll తొలి ll
చరణం:  నీ సోయగాల సహవాసాన నా మనసు తొక్కే పరవళ్ళను 
             నీపై సెలయేళ్ళుగ వెలయించుకుని 
             నిన్ను పిలిచే నా పిలుపులను 
            నీ వలపు మాగాణిని పండించే విత్తులుగా నాటుకుని 
            మౌనంగా జారే నా మోదబాష్పాలకు 
           దూకే నీ జలపాతాల హోరు నచ్చి 
           వివిధానుభూతుల వికసిత వేణియపై 
           కిలకిల కలస్వరాలను నాకై మ్రోగిస్తూ 
          ఈయవే నా మనసుకు నీయంత అండ     ll తొలి ll
                              ******** 

 

No comments:

Post a Comment