Wednesday 4 November 2015

శిద్దాని భావగీతాలు

పల్లవి :    రెక్కలు తొడుగు రివురివ్వున ఎగురు 
             నింగికి లేదు నిన్నాపే జోరు 
             నీ గమ్యం నీవేనే నా మనసా 
             నీ తోడే నాకండా అది తెలుసా
చరణం:     పున్నమి జాబిలిలా జగమంతా వెలిగించు        
              కమ్మని ఊహలతో కాలాన్నే పూయించు 
              అడుగుల నడవడితో అందరినీ పరికించు 
              ఆమని పలుకులతో దరహాసం వెలయించు
              క్షణమాగని పయనంలోన  
              జనక్షేమం మతమంటూనే
              మునుముందుకు సాగుతుపోవే నా మనసా    ll రెక్కలు ll
చరణం :    ఆగని పోరు సలుపు నీదేగా మరి గెలుపు 
              అలలకు గురువై నీవు అందని తీరం చేరు           
              విలువల వేణియపై సుమగీతం పలికించు 
              కిలకిల నవ్వులతో అనురాగం రవళించు 
              కనుజారే చుక్కలలోన  
              చెలరేగే భావనలెరిగి 
              ఎదఎదలో దివ్వెగ వెలిగే నా మనసా                   ll రెక్కలు ll


                             ********

Monday 21 July 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:  ఆనందం కావాలా
           అందరికీ సొంతం
           అయితే మరి వినవోయీ
           చెబుతా ఆ తంత్రం
         
చరణం:  కన్నుల జారే చుక్కల వడిలో
            కరిగిన ఆశలు నివురైపోతే
            మనిషికి మనిషే తోడుగ రాగా
            సమతలు మమతలు మనవై పోగా
           వికాస వేణియ హాసపు రాగం 
           విరామమెరుగక వింటూ ఉందాం
చరణం:  వేదనకిక్కడ చోటే లేదని
            వేడుకకెపుడూ లోటే రాదని
            మనసుకు మనసులు జతగా చేద్దాం
            అడుగులు ఒంటరి కానే కావని
            దూరం చెరగక పోనే పోదని
            నవ్వుతు చెలిమికి ప్రాణం పోద్దాం
చరణం:   మనసుల అందం తెలిపే తీరుగ
             అందరు ఒకటై సాగే తోవన
             దేవుడు కూడా జతగాడవడా
             మంచిని మతమై పెంపే చేస్తే
             విలువల భవితకు పునాదులేస్తే
             మనిషివి నీవని నమ్మే నీ'వని'.
                            ******

Friday 27 June 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:   నవ్వులు చరితై పోయాయా?
           కన్నీరు భవితగ మిగిలిందా?
           లేలేత పెదవుల లాలనతో
           జగాన నిలిచే యోగమె నాకు
           ఉందో లేదో చెప్పవోయి తెలుగోడా
చరణం: కమ్మని మాధుర్యం పంచుతాను నేనంటే
           వద్దను దారిద్ర్యం పెరిగిందిగ నా ఇంటే
           బుడిబుడి అడుగులతో వామనుడై ప్రతివాడు
           శిరసును చూపంటూ తప్పటడుగులే వేస్తుంటే
           కాంతితో వెలిగే అమ్మల కన్నుల సాక్షిగా
           భ్రాంతితో మురిసే నాన్నల ఆశల సాక్షిగా
           అంపశయ్య పైనుండి అడుగుతుంటి ఈ మాట   ll నవ్వులు ll
చరణం:  చులకన మాటలతో చేస్తుంటే సన్మానం
            విలువే లేదంటూ చేస్తుంటే ఛీత్కారం
            గతాన్ని నేమరేస్తూ నింపుకుంటి క్షీరధార
            ఉగ్గును పడుతూనే పాపల నోట పసిపాపగ పుట్టాలని
            జ్వాలగ రగిలే సుకవుల ఆత్మల సాక్షిగా
            మూల్గుతు కుమిలే సాహితి సుమాల సాక్షిగా
            అత్యాశని తెలిసినా అడుగుతుంటి ఈ వరం.      ll నవ్వులు ll
                                   
                               ********

Monday 16 June 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:       ఓ తల్లి కన్నదేగా! నేటి నా ఈ దైన్యం
               ఆనాడే ఆ అమ్మకు తెలుసుంటే ఈ నిజం
               మారేది కాదా? ఈ సృష్టి నైజం చరణం:     అడుగు బైట పెట్టేవేళ, అడవే ఎదురొస్తుంటే                మాటేసి, మృగాలు మాటలకందని మారణహోమం చేస్తుంటే
               ఆరిపోయే జ్యోతులలో, మసకబారే దివ్వెలతో               వన్నెలద్దుకుంటున్నది నవ్యభారతం               అవమానపు దారులలో, ఆక్రోశపు లోతులలో ఆవిరైపోతుంటే     ఆడతనం
              నిట్టూర్పులు విడుస్తూ కొత్త చట్టాలు పుట్టిస్తూ               భయమనే బంగారు పంజరాన               భద్రంగా దాచుకోమంటున్నారా? మా భవితవ్యం
చరణం:    కడుపున కన్నైనా తెరవనినాడే ఆడపిల్లను కాటికంపే ఈ లోకానా               అడుగుకొక్క యముడంటూ, రావణులు కీచకులు కొల్లలంటూ               పుట్టిననాడే ఎందుకు అనలేదమ్మా
              దీర్ఘాయుష్మానంటూ నిండుగా నువ్ దీవించే ఆ దీవెన వద్దని               దీర్ఘమానవతిగా మనమంటూ దీవించమనేదాన్ని కదమ్మా ఆనాడే చరణం:   మానాలు మీకు చలిమంటలా?
              శీలాలు మీకు గడ్డిపోచలా?               కన్నీరుగా మా ఎదలలో రగిలే విషాదాలు
               ఇంకెన్నాళ్ళు మోయాలి మీ మగతనపు ఆనవాళ్ళు
               ప్రాయపు ఊసెందుకంటూ, అభిప్రాయాలు అసలు వద్దంటూ                 కనుగానని కామాన సాగుతున్న మీ పయనాన                 అమ్మను అమ్మగా ఇంకెంత కాలం చూస్తారో
                       **********

Wednesday 28 May 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:      రాలే చినుకులనూ లెక్కిద్దాం
              నవ్వే చుక్కలతో హెచ్చిద్దాం
              అంతకు రెట్టింపూ ఊహలు మావంటూ
              ఇంపుగ చెప్పేద్దాం లోకాన్నూరిద్దాం
చరణం:    ఎగిరే గువ్వను ఆపి
             ఎగిసే హృదయం ఇచ్చి
             నింగిని నేలను కలిపే
             ఇంద్రచాపం అల్లేయమందాం
            పారే ఏటిని చూస్తూ
            పాడే పాటను నేరుస్తూ
            గలగల మంటూ నవ్వేద్దాం
            గాంధర్వాలను పాడేద్దాం                           ll రాలే ll
చరణం:   తుమ్మెద రెక్కల తేరులపై
             పసి పెదవుల నవ్వును నింగికి చేర్చి
             నెలవంకను జతగా చేద్దాం
             నిండు జాబిలిగ మార్చేద్దాం   
             మధురోహలతో మనసును శృతి చేసేయ్
             పొంగే మధువును అందరి పాలు చేసేసేయ్
                అసలు అమృతమే అదని చాటేసేయ్              ll రాలే ll
                             *******

Saturday 22 March 2014

శిద్దాని భావగీతాలు



పల్లవి:     నింగిని విడిచా చినుకు
             జారే పథాన ఎగసి
             పల్లవి పాడెను మనసు
             అణిగిన ఆశలు రేగి
            నవ్వే ఏటికి మల్లె
            అల్లరి చేసెను వయసు
చరణం:  పొంగిన హృదయమే
           చినుకుకు స్వరమై
           చిటపట పాటలే
           పుడమికి సర్వమై
          సాగేటి రాగాల హేలలో
          వినిపించు ఆనంద రవళిలో
           తనువే విరిసే బృందావనిలా
           మనసే ఆడెను మందాకినిలా
చరణం:  అనుభవ సాగరం
           అయ్యే మానసం
           గురుతుల విల్లులే
           రాసెను చినుకులే
          గాంధర్వ గానాల మధురిమతో
          మన్నింటి మత్తైన పిలుపులతో
          ముంగిలికొచ్చే మయూరాంగనై
          చేతననిచ్చే జీవనాదమే
చరణం: తెమ్మెర పిలుపులే
           రమ్మని లేఖలై
          తలుపుల వెనకాల
          తలపులు పూయించె
          మురిపాల మువ్వలా సవ్వడితో
          ఊరేగే పరువాల పల్లకిలో
          మనసే తనుగా మందహాసాన
          మరులే కురిసే నందనవనాల.
                  ******

Wednesday 1 January 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:       చూపులు కలసి, వెన్నెల కురిసే వేళలో
                 మాటలు రాక, పెదవులు వణికేనేలనో
                 మాటలు రాక, పెదవులు వణికే వేళలో
                 మధువులేవో, మనసుల నూరే నేలనో
చరణం:      ఊహలన్ని నిజమై, మదినూయలనూపే వేళ
                 కలలన్ని వరాలై, కొంగుముడివడే శుభవేళ
                 ఏడడుగులు వేస్తూ, ఎద సవ్వడులను విందాము
                 ఇద్దరమొకటంటూ, కడదాకా కలిసుందాము
చరణం:       నీ చూపుల లేఖను, చదివే ఈ తొలిరాతిరిన
                  నీ రూపు వెలిగెనే, నా ఎదను కోటి దివ్వెలుగ
                  చిరునవ్వుల సడికిక, చిరునామా మనమనేల
                  ఏ కవి రాయలేని, కావ్యంలా సాగిపోదాం
చరణం:       మన మనస్సులొక్కటై, చేసే వలపుల మధనాల
                  పొంగేటి అమృతమే, కాదా అనురాగమంటే
                  ఆ అనురాగాలే, మనవైన సరాగాలుగా
                  పాడుతూ ఈ ఇలను, మధువనిలా మలచుకుందాము
                                 **********